: గుంటూరు - కాచిగూడ రైలు టాయ్ లెట్ లో మహిళ మృతదేహం... చూసీ స్పందించని ప్రయాణికులు!
అది గుంటూరు, కాచిగూడల మధ్య నడిచే పాసింజరు రైలు. ఎప్పటిలానే ఈ ఉదయం కాచిగూడకు చేరింది. రైలును శుభ్రం చేస్తున్న సమయంలో ఓ మరుగుదొడ్డిలో మహిళ మృతదేహం కనిపించింది. ఎవరో ఆమెను హత్య చేసి టాయ్ లెట్లో పడేసి వుంటారని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. చాలా గంటల క్రితమే మహిళ హత్య జరిగి వుంటుందని భావిస్తున్న పోలీసులు ఒక్కరైనా ఫిర్యాదు చేయకపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ రైలు గుంటూరు నుంచి వినుకొండ, మార్కాపురం, నంద్యాల, డోన్, కర్నూలు, మహబూబ్ నగర్ ల మీదుగా కాచిగూడ వస్తుంది. మార్కాపురం తరువాతి ప్రాంతాల వారు అతి తక్కువ ఖర్చుతో హైదరాబాద్ చేరుకునేందుకు ఈ రైలు ఎక్కుతారు. దీంతో రాత్రిపూట నడిచే ఈ రైలు నిత్యమూ కిటకిటలాడుతుంది. అటువంటి రైలులో టాయ్ లెట్లో మృతదేహాన్ని పడేసిన తరువాత, ఎంతో మంది దాన్ని చూసి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రైలు కాచిగూడ వచ్చి, శుభ్రం చేసే కార్మికులు చూసేంతవరకూ మహిళ హత్య గురించిన సమాచారం లేకపోవడం గమనార్హం.