: నేతాజీకి కర్మ చేయవద్దన్న గాంధీ... అస్థికలు తేవద్దన్న పీవీ!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించిన రహస్య ఫైళ్లలోని కీలక సమాచారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. నేతాజీ మరణ వార్త గురించి, ఆయనతో విమానంలో ప్రయాణించిన హబీబుర్ రెహమాన్, మహాత్మా గాంధీకి చెప్పిన వేళ, ఆయన ఆ విషయాన్ని నమ్మలేదు. "సుభాష్ విమాన ప్రమాదంలో మరణించాడంటే నేను నమ్మను. ఆయన కర్మకాండలు జరిపించవద్దు" అని గాంధీ వ్యాఖ్యానించినట్టు బోస్ కుమారుడు అమియా నాథ్ బోస్ తెలిపినట్టు ఉన్న ఓ ఫైల్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి 1995లో పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో కూడా చర్చ జరిగింది. ఆ సమయంలో బోస్ అస్థికలను ఏం చేయాలని కోరుతూ జపాన్ నుంచి లేఖ రాగా, దానిపై చర్చించిన పీవీ మంత్రివర్గం వాటిని ఇండియాకు తీసుకురాకూడదని అభిప్రాయపడింది. వాటిని తీసుకువస్తే, ఆయన బతికున్నట్టు నమ్ముతున్న బెంగాల్ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, పైగా ఏ వర్గం నుంచి కూడా ఆయన అస్థికలని తీసుకురావాలని డిమాండ్ రావడం లేదని పీవీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 'నేతాజీ యాషెస్ ఇన్ టోక్యో' పేరిట ఉన్న నోట్ ఫైల్ విడుదలైంది.