: 'ఫేస్ బుక్' స్నేహం నిజమైనదేనా?: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం
యువతరం సోషల్ మీడియాను వినియోగించడంలో దూసుకుపోతున్నారు. ఫేస్ బుక్ లో కామెంట్లు, ఫోటోలు పెట్టి ఎన్ని లైకులు, షేర్లు, కామెంట్లు వచ్చాయో చూసుకోవడం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో స్నేహాలకు విలువెంత? అనే అంశంపై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం పరిశోధనలు చేసింది. ఈ బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ రాబిన్ డుంబార్ 150 మంది యూజర్ల నుంచి వివిధ అంశాలపై సమాధానాలు రాబట్టారు. సోషల్ మీడియాలో అకౌంట్ ఉండడం ఆనవాయతీ అన్నట్టు నెటిజన్ల తీరు ఉందని ఆయన చెప్పారు. ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవాళ్లంతా మీకు నిజంగా స్నేహితులేనా? అన్న ప్రశ్నకు కచ్చితంగా 'నో' అని అసమాధానం చెప్పారట. ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న 27 శాతం మంది మాత్రమే స్నేహితుల్లా స్పందిస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఫేస్ బుక్ లో కేవలం నలుగురు లేక ఐదుగురు మాత్రమే మన బాగోగులు చూసుకుంటారని, 15 శాతం మంది మాత్రమే స్నేహితుల బాధలను తమ బాధలుగా భావిస్తారని ఫేస్ బుక్ యూజర్లు సమాధానాలు ఇచ్చారని ఆయన చెప్పారు. నేరుగా కలిసిన వ్యక్తులతో మాత్రమే నిజమైన స్నేహం ఎక్కువ కాలం ఉంటుందని, లేని పక్షంలో స్నేహితులు బాధ, సంతోషం తదితర విషయాల్లో పెద్దగా స్పందించరని ఈ పరిశోధనలో తేలినట్టు ఆయన తెలిపారు.