: నేతాజీ 100 రహస్య దస్త్రాలను నేడు బహిర్గతం చేయనున్న మోదీ
ఇవాళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119 జయంతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన 100 రహస్య దస్త్రాలను డిజిటల్ ప్రతుల రూపంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేయనున్నారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద జరిగే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ సమయంలోనే నేతాజీ ఫైళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బోస్ కుటుంబసభ్యులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. 'భారత జాతీయ ప్రాచీనపత్ర భాండాగారం (ఎన్ఏఐ) నేతాజీకి సంబంధించిన వంద దస్త్రాలకు ప్రాథమిక సంరక్షణ చర్యలు, డిజిటలైజేషన్ చేపట్టింది. నేతాజీ జయంతి సందర్భంగా ఈ రోజు (జనవరి 23) ప్రధాని మోదీ ఆ డిజిటల్ ప్రతులను అంతర్జాలంలో విడుదల చేస్తారు' అని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో నెలకు 25 ప్రతులను విడుదల చేయనున్నారు. కాగా గతేడాది నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.