: మందేసి ఉబెర్ డ్రైవర్ పై వీరంగమాడిన యువతి... సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఉబెర్ డ్రైవర్లంటేనే మహిళలు హడలిపోతారు. ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనే ఇందుకు కారణం. అయితే మియామీలో వైద్య విద్య అభ్యసిస్తున్న అంజలి రామ్ కిస్సూన్ అనే యువతి మాత్రం భయపడలేదు కదా, ఆ సంస్థ కారు డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడి చేసింది. తిట్ల దండకం అందుకుంది. కారులో కూర్చుని నానా రభస చేసింది. బిత్తరపోయిన సదరు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం మినహా ఏమీ చేయలేకపోయాడు. అయినా ఆ సమయంలో ఆ యువతి ఏ స్థితిలో ఉందో తెలుసా? ఫుల్లుగా మద్యం సేవించి ఉందట. అకారణంగా ఉబెర్ డ్రైవర్ పై దాడి చేసిన అంజలి, కారులో కూర్చుని అందులోని పేపర్లు, ఇతర వస్తువులన్నింటినీ బయటకు విసిరేసి నానా బీభత్సం చేసింది. ఈ మొత్తం తతంగాన్ని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.