: ఏపీకి అందనంత ఎత్తులో తెలంగాణ!... రూ.1.40 లక్షల కోట్ల పద్దుకు కేసీఆర్ ఆర్డర్


ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం నేపథ్యంలో అప్పటిదాకా కొనసాగిన ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. 13 జిల్లాలున్న సీమాంధ్రతో ఏపీ వైశాల్యం పరంగా కుంచించుకుపోతే, 10 జిల్లాలతో కొత్తగా తెలంగాణ ఆవిర్భవించింది. హైదరాబాదుతో కూడిన తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించగా, ఆర్థిక లోటుతో పేద రాష్ట్రంగా ఏపీ ఇబ్బందుల్లో చిక్కుకుంది. రాష్ట్ర విభజన జరిగి అప్పుడే రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలు రెండు బడ్జెట్లను ప్రవేశపెట్టాయి. తొలి బడ్జెట్ (2014-15) లో పెద్ద రాష్ట్రంగా ఉన్న ఏపీ... తెలంగాణ కంటే కాస్తంత పెద్దరికాన్నే చూపింది. ఆ బడ్జెట్ లో ఏపీ రూ.1,11,824 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టగా, తెలంగాణ తొలి యత్నంలోనే రూ.1,00,637 కోట్లతో లక్ష కోట్ల మార్కును దాటేసింది. ఇక రెండో బడ్జెట్ (2015-16)లో ఏపీని దాటేసిన తెలంగాణ రూ.1,15,689 కోట్ల భారీ పద్దును ప్రవేశపెట్టింది. ఆ ఏడాదిలో ఏపీ రూ.1,13,049 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. తాజాగా ఇరు రాష్ట్రాలు 2016-17 బడ్జెట్ కసరత్తులు ప్రారంభించాయి. రెండో బడ్జెట్ లోనే ఏపీని దాటేసిన తెలంగాణ.. తన భారీతనాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకుంది. ఈ మేరకు బడ్జెట్ కసరత్తులు ప్రారంభానికి ముందే అధికారులతో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. గతేడాది బడ్జెట్ లో ఏపీని దాటేసినా, తేడా కేవలం 2 వేల కోట్లు మాత్రమే. అయితే ఈ దఫా ఏపీ... తమ దరిదాపుల్లోకే రాని రీతిలో బడ్జెట్ ను రూపొందించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ బడ్జెట్ రూ.1.40 లక్షల కోట్లతో రూపొందుతోందట. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.62 వేల కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ.78 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్ల మధ్య ఉండనుంది. ఇక ఏపీ బడ్జెట్ కసరత్తును ప్రారంభించిన ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రూ.1.30 లక్షల కోట్లతో పద్దుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అంటే, ఈ దఫా తెలంగాణ బడ్జెట్... ఏపీ కంటే రూ.10 వేల కోట్లు అధికంగా ఉండనుందన్నమాట.

  • Loading...

More Telugu News