: మా నాన్న చనిపోయారనే నమ్ముతున్నా: నేతాజీ కుమార్తె అనితాబోస్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రమాదంలో చనిపోయి ఉంటారనే వార్తను తాను నమ్ముతున్నానని ఆయన కుమార్తె అనితాబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు నేతాజీ 119వ జయంతిని పురస్కరించుకుని ఆమె మీడియాతో మాట్లాడారు. తమ తండ్రికి సంబంధించిన ప్రత్యేక జ్ఞాపకాలేవీ తమకు లేకపోయినప్పటికీ, ఆయన గొప్పతనం గురించి తన తల్లి చెబుతుండేదన్నారు. దేశం కోసం జీవితాన్ని అర్పించిన గొప్ప వ్యక్తి మరణం వివాదాస్పదం కావడం, దాని ద్వారా ఆయన్ని ప్రజలు గుర్తుంచుకోవడం తనకు బాధ కలిగిస్తోందని అన్నారు. జపాన్ లో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని, భారత్-జపాన్ ప్రభుత్వాలు ఈ వ్యవహారంపై తక్షణం స్పందించాలని ఆమె కోరారు. నేతాజీ విషయంలో వాస్తవాలను జపాన్ బయటపెట్టకపోవడం ఆ దేశ ప్రతిష్టకు అవమానకరమైన విషయమన్నారు. నేతాజీ-నెహ్రూల అభిప్రాయాలు, రాజకీయ విభేదాలు, నేతాజీ గుమ్ నామి బాబాగా మారారన్న వదంతులు మొదలైన అంశాలపై అనితాబోస్ మాట్లాడారు. కాగా, నేతాజీకి సంబంధించిన అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. నేతాజీకి సంబంధించిన మరికొన్ని రహస్య ఫైళ్లను ప్రధాని మోదీ రేపు బహిర్గతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అనితాబోస్ చేసిన ఈ వ్యాఖ్యలు గమనార్హం.