: చిన్ననాటి చేదు అనుభవాలు పెద్దయ్యాక ప్రభావం చూపిస్తాయట!
చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు ఆయా వ్యక్తులపై పెద్దయ్యాక కూడా ప్రభావం చూపిస్తాయట. ఈ విషయాన్ని యూఎస్ లోని మిచిగాన్ యూనివర్శిటీ కి చెందిన డేవిడ్ మార్షల్ వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ఒక తాజా అధ్యయనం ద్వారా పలు విషయాలను కనుగొన్నామన్నారు. చిన్నవయస్సులో నిరాదరణకు, దూషణలకు, శారీరక హింసకు గురవడం, లైంగిక వేధింపులు, అవహేళనల పాలవడం వంటి సంఘటనల ప్రభావం వారు పెద్దయ్యాక వారి మెదడు పనితీరుపై పడుతుందన్నారు. తద్వారా నిత్యజీవితంలో ప్రధానంగా అత్యవసర సమయాల్లో త్వరగా తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో వారు చురుగ్గా వ్యవహరించలేరన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు, అత్యవసర సమయాల్లోను వారు తీసుకునే నిర్ణయాల్లో కచ్చితత్వం లోపిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశంపై గతంలో నిర్వహించిన రీసెర్చిలో మానసిక ఆరోగ్య పరిస్థితులు, బై పోలార్ డిజార్డర్, జ్ఞాపకశక్తి మొదలైన విషయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు డేవిడ్ తెలిపారు.