: టికెట్ల కేటాయింపులో తనను పట్టించుకోలేదని... టీ-టీడీపీకి కృష్ణయాదవ్ రాజీనామా
జీహెచ్ఎంసీ ఎన్నికల టికెట్ల కేటాయింపు ప్రక్రియ పలు పార్టీల నేతలలో అసంతృప్తి రేపింది. ముఖ్యంగా పలువురు తెలంగాణ టీడీపీ నేతలు టికెట్ల కేటాయింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ల కేటాయింపులో తనను పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి, పాతబస్తీకి చెందిన టీటీడీపీ ఉపాధ్యక్షుడు కృష్ణయాదవ్ రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు మంత్రివర్గంలో కృష్ణయాదవ్ మంత్రిగా చేశారు. ఈ సమయంలో జరిగిన స్టాంపుల స్కాంలో జైలుకి వెళ్లారు. ఆ వెంటనే టీడీపీ ఆయనను బహిష్కరించడంతో రాజకీయంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. జైలు నుంచి విడుదలై వచ్చాక ఎంతో కష్టంమీద అధ్యక్షుడి అంగీకారంతో మళ్లీ టీడీపీలో చేరారు. అనంతరం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇంతకాలం కృష్ణయాదవ్ పై అంతగా దృష్టి పెట్టని టీడీపీ మరిప్పుడాయన పార్టీకి గుడ్ బై చెబితే ఏమంత నష్టంలేదనే భావించవచ్చు. ఇదిలాఉంటే, శేరిలింగంపల్లికి చెందిన టీడీపీ నేత బండి రమేశ్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నారని సమాచారం.