: తుందుర్రులో ఉద్రిక్తత... పోలీసులపై రాళ్లు రువ్విన గ్రామస్థులు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో కొద్దిసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి అక్వా ఫుడ్ పార్క్ పేరిట ఏర్పాటు కానున్న భారీ పరిశ్రమను తుందుర్రు ప్రజలు అడ్డుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను బద్దలు కొట్టారు. పోలీసుల వలయాన్ని నెట్టేశారు. కంచెను తుత్తునియలు చేశారు. ఒక్కసారిగా ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో పోలీసులు బిత్తరపోయారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను నిలువరించలేక పోలీసులు చేతులెత్తేశారు. పరిశ్రమను కాకుండా ఆక్వా వర్సిటీని ఏర్పాటు చేయాలన్న తమ వినతిని పెడచెవిన పెట్టిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు కూడా తమ చేతుల్లోని లాఠీలకు పనిచెప్పారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న తోపులాటలో పలువురు కిందపడిపోయారు. మరికొందరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న తుందుర్రు... గ్రామస్థుల ఆందోళన, పోలీసులు లాఠీచార్జీలతో ఉద్రిక్తంగా మారింది.