: రోహిత్ ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్!...సూసైడ్ నోట్ లో పేరాను కొట్టేసి, తానే కొట్టేశానంటూ సంతకం!
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యలో కొత్త మలుపు చోటుచేసుకుంది. కుల వివక్ష, వర్సిటీ అధికారుల వేధింపుల కారణంగా రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని నిన్నటిదాకా వినిపించిన ఆరోపణలు కాస్తంత తగ్గాయి. రోహిత్ వేముల అసలు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తే కాదన్న వాదన బయటకు రావడంతో ఆందోళన తీవ్రత తగ్గింది. అయితే చనిపోవడానికి ముందు రోహిత్ రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ ప్రస్తుతం ఈ వ్యవహారంపై కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్య చేసుకునే ముందు రోహిత్ వేముల తీవ్ర మానసిక వేదనతో ఓ లేఖ రాశాడు. ‘‘నా జన్మే ఓ పెద్ద ప్రమాదం’’ అంటూ మొదలుపెట్టిన అతడు గూఢార్థాలతో కూడిన సుదీర్ఘ లేఖను రాశాడు. సదరు లేఖలో ఏ ఒక్కరిని కూడా అతడు నిందించలేదు. తన ఆత్మహత్యకు తానొక్కడిని మాత్రమే కారణమని కూడా రోహిత్ పేర్కొన్నాడు. అయితే ఆ లేఖలో ఓ పేరాగ్రాఫ్ మేర రాసిన విషయాలన్నీ కొట్టేసి ఉన్నాయి. కొట్టేసిన అక్షరాలు ఏమాత్రం కనిపించకుండా నిండా ఇంకుతో రుద్దేసి ఉన్నాయి. అంతేకాక సదరు కొట్టేసిన పేరాగ్రాఫ్ పక్కన ‘‘నేనే కొట్టేస్తున్నాను’’ అని పేర్కొన్న రోహిత్ అక్కడ సంతకం కూడా చేశాడు. దీనిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు లేఖను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని పోలీసులు చెబుతున్నారు. అక్షరాలను కొట్టివేయదలిస్తే...ఓ అడ్డగీత గీస్తే సరిపోయేదానికి బదులుగా, అసలు సింగిల్ అక్షరం కూడా కనిపించకుండా రుద్దేసిన వైనం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో ఏఏ అంశాలు వెలుగుచూస్తాయోనన్న ఆసక్తి నెలకొంది.