: పుతిన్ పై హత్యారోపణలు చేసిన బ్రిటన్ హోం సెక్రటరీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై బ్రిటన్ హోం శాఖ సెక్రటరీ థ్రేసా హత్యారోపణలు చేశారు. రష్యా గూఢచార సంస్థ కేజీబీలోను, ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ లోను పనిచేసిన అలెగ్జాండర్ లెట్వినెంకోను విష ప్రయోగం ద్వారా హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఇటువంటి హత్యలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంచితే, రష్యా గూఢచారి సంస్థలో పనిచేసిన అలెగ్జాండర్ లెట్వినెంకో రష్యాను వదిలి వచ్చి, బ్రిటన్ లో స్థిరపడ్డారు. ఆ తరువాత ఆయన రష్యాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా స్పెయిన్-రష్యా మాఫియా మధ్య సంబంధాలపై పరిశోధనలు చేశాడు. దీనిపై మరిన్ని ఆధారాలు సేకరించేందుకు మాజీ గూఢచారి ఆండ్రీ లుగోవ్ తో కలిసి ఆయన స్పెయిన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి మరో ఏజెంట్ దిమిత్రి కొవట్యూన్ తో కలిసి సెంట్రల్ లండన్ లో ఓ టీ తాగారు. ఆ తర్వాత ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మూడు రోజుల తరువాత బ్రిటన్ జనరల్ హాస్పిటల్ లో చేరారు. ఆ సందర్భంగా తాను విషప్రయోగానికి గురయ్యానని ఆయన వెల్లడించారు. దీంతో ఆయనను నవంబర్ 17న మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి ఆయన తుదిశ్వాస విడిచారు. అనంతరం బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎంఐ6 జరిపిన దర్యాప్తులో ఆ టీలో రేడియో ధార్మిక పదార్థం పొలోనియం-210ను కలిపినట్టు నిర్ధారణ అయింది. ఇది అంతర్జాతీయ న్యాయ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్న థ్రేసా, ఇటువంటి హత్యలను ఉపేక్షించలేమని తేల్చి చెప్పారు. దీంతో రష్యాపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. తాజాగా పుతిన్ పర్యటనపై ఆంక్షలు విధించనున్నట్టు వెలువడుతున్న వార్తలను లెట్వినెంకొ భార్య స్వాగతించారు.