: ఆరంగుళాలు తగ్గిన మోదీ ఛాతీ?
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఛాతీ చుట్టుకొలత ఆరు అంగుళాలు తగ్గిందా? అసలు ఆయన ఛాతీ చుట్టుకొలత ఎంత?... 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, "మరో గుజరాత్ రాష్ట్రాన్ని తయారు చేసే శక్తి మోదీకి లేదని ఆ నేత వ్యాఖ్యానించారు. మరో గుజరాత్ తయారు కావాలంటే ఏం ఉండాలో తెలుసా? 'చప్పన్ ఇంచ్ కీ ఛాతీ' (56 అంగుళాల ఛాతీ)" అన్నారు. ఈ వ్యాఖ్యల తరువాత దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. మోదీకి 56 అంగుళాల బలమైన ఛాతీ ఉందని అందరూ భావించారు. కాంగ్రెస్ పార్టీ ఇదే అంశంపై విమర్శలు కూడా చేసింది. కానీ ఆయన వాస్తవ ఛాతీ కొలత ఎంతన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ విషయం తెలిసిపోయింది. బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ యూనివర్శిటీ స్నాతకోత్సవానికి మోదీ అతిథిగా రానున్న వేళ, ఆయన ధరించాల్సిన పొడవు కోటును తయారు చేసేందుకు కొలతలు ఇవ్వాలని వర్శిటీ అధికారులు ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించగా, 50 అంగుళాల ఛాతీ చుట్టుకొలత, 21 అంగుళాల భుజాల పొడవుతో తయారు చేయాలన్న సమాధానం వచ్చింది. ఆయన కోసం బంగారు వర్ణంలో ప్రత్యేక కోటు ఢిల్లీలో ప్రధానికి డ్రస్ లు కుట్టించే దర్జీ వద్ద తయారు అవుతోంది. ఇక గతంలో ఛాతీ కొలతకు, ఇప్పుడు ఛాతీ కొలతకు తేడా వుందా? అని సదరు టైలర్ ను ప్రశ్నిస్తే, సమాధానం ఇచ్చేందుకు నిరాకరించాడు. "ఇది ఓ రాజకీయ అంశం" అంటూ దీనిపై స్పందించలేనని తప్పించుకున్నాడు. ఇక గతంలో 56 అంగుళాలు ఉండి, ఇప్పుడు తగ్గిందా? అన్న విషయం ప్రధానే వెల్లడించాలి.