: అభివృద్ధి కన్నా పెద్దపులులు ముఖ్యమా?... సుప్రీంకోర్టు సూటి ప్రశ్న
దేశంలో పెద్దపులుల సంరక్షణ ముఖ్యమే అయినప్పటికీ, అభివద్ధికే పెద్ద పీట వేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నాగపూర్ నుంచి జబల్ పూర్ వరకూ వెళ్లే 7వ నంబర్ జాతీయ రహదారి పెన్చ్ టైగర్ రిజర్వ్ నుంచి వెళుతున్నందున, పనులను నిలిపి వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు, అభివృద్ధి పనుల కన్నా పెద్దపులులు ముఖ్యమా? అని పిటిషనర్ ను ప్రశ్నించింది. దేశాభివృద్ధిని పణంగా పెట్టి పులులను సంరక్షించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. జాతీయ రహదారి విస్తరణ కొద్ది మీటర్లు మాత్రమే జరుగుతుందని, దీనివల్ల పులుల మనుగడపై ప్రభావం ఉండదని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏకే సిక్రీ, ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ కోర్టును ఆశ్రయించే బదులు సూక్ష్మ స్థాయిలో వేటగాళ్ల బారి నుంచి పులులను సంరక్షిస్తున్న వారితో కలిసి పనిచేయవచ్చు కదా? అని మెత్తగా మొట్టింది.