: నారా లోకేశ్ కటౌట్లను చించేసిన ఫలితం... టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు
గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారట. ఈ మేరకు నిన్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మెరుపు ఆందోళనకు దిగిన ఆ పార్టీ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్) ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి... అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కటౌట్లను చించేశారు. తన వెంట వచ్చిన అనుచరులతో కలిసి ఆయన లోకేశ్ కటౌట్లపై చెయ్యేశారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ లపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రేటర్ బరిలో వారిద్దరూ టికెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ ఆందోళన జరిగిన కొద్దిసేపటికే శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు టీఎన్ఎస్ఎప్ ఇంచార్జీ మదన్ మోహన్ రావు ప్రకటించారు. గ్రేటర్ బరికి సంబంధించి అక్బర్ బాగ్ టికెట్ ను ఆశించిన శ్రీకాంత్ రెడ్డి, టికెట్ దక్కకపోవడంతో తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి ఆందోళనకు దిగారని ఆయన ఆరోపించారు. ఆందోళనలో భాగంగా శ్రీకాంత్ రెడ్డి పార్టీ యువనేత లోకేశ్ కటౌట్లు, ఫ్లెక్సీలను చించేశారని... దీనిని పార్టీ వ్యతిరేక చర్యగానే పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధినాయకత్వం నుంచి అందిన ఆదేశాల మేరకే శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు మదన్ మోహన్ రావు చెప్పారు.