: బహిరంగ వేలానికి ‘కావూరి’ స్థిరాస్తి!... ఆసక్తి చూపని బిడ్డర్లు


మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి కేంద్ర మంత్రి పదవిని సైతం అధిష్టించి ఆ తర్వాత బీజేపీిలోకి చేరిపోయిన సీనియర్ రాజకీయవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త కావూరి సాంబశివరావు బ్యాంకులకు భారీగా బకాయి పడ్డ సంగతి తెలిసిందే. అంతేకాక ఆయన నేతృత్వంలోని ‘ప్రొగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్’ వాణిజ్య పన్నుల శాఖకు కూడా భారీగా పన్ను బకాయి పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో కావూరికి చెందిన ఓ స్థిరాస్తిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం వేలం వేసేందుకు యత్నించింది. స్వాధీనమైతే చేసుకుంది కానీ ప్రభుత్వం ఆ ఆస్తిని మాత్రం వేలం వేయలేకపోయింది. కారణమేంటంటే ప్రభుత్వం విడుదల చేసిన వేలానికి ఏ ఒక్క బిడ్డర్ కూడా ముందుకు రాలేదట. వివరాల్లోకెళితే... ‘ప్రొగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్’ వాణిజ్య పన్నుల శాఖకు రూ.12 కోట్ల మేర పన్ను బకాయి పడింది. ఈ నేపథ్యంలో పన్నును ముక్కు పిండి వసూలు చేసేందుకు రంగంలోకి దిగిన ఆ శాఖ హైదరాబాదులోని ఖైరతాబాదు ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్ లో కావూరి పేరిట ఉన్న 1,160 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఓ పురాతన భవనం ఉన్న ఆ స్థలాన్ని బహిరంగంగా వేలం వేసేందుకు సదరు శాఖ కోర్టు అనుమతి తీసుకుంది. నిన్న వేలం కూడా నిర్వహించింది. ప్రస్తుతం అక్కడ గజం విలువ బహిరంగ మార్కెట్ లో రూ.35-40 వేలు ఉండగా, వాణిజ్య పన్నుల శాఖ మాత్రం గజం విలువను ఏకంగా లక్ష రూపాయలుగా నిర్ధారించింది. ఈ కారణంగానే బిడ్డర్లు ఎవరూ రాలేదట. ప్రారంభ ధర మరీ ఎక్కువగా ఉందని చెప్పిన బిడ్డర్లు ధరను తగ్గిస్తే కొనేందుకు సిద్ధమని కూడా ఆ శాఖకు విన్నివించారు. ఈ నేపథ్యంలో కావూరి స్థలం వేలానికి మరోమారు ప్రకటన జారీ చేస్తామని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News