: ప్రాణాలకు తెగించి పోరాడి విద్యార్థులను కాపాడిన ప్రొఫెసర్!
పాకిస్థాన్ బచాఖాన్ యూనివర్సిటీపై ఉగ్రవాదులు విరుచుపడ్డ సందర్భంగా కెమిస్ట్రీ ప్రొఫెసర్ సయ్యద్ హమీద్ హుస్సేన్ వీరోచిత పోరాటం స్పూర్తి నింపుతోంది. యూనివర్సిటీ హాస్టళ్లలో 3000 మంది విద్యార్థులు, 600 మంది అతిథులు ఉన్నారు. అయితే యూనివర్సిటీ క్యాంపస్ లో చొరబడిన ఉగ్రవాదులు తుపాకులతో హోరెత్తించడంతో ఓ భవనంలో ఉన్న విద్యార్థులను ఆయన హెచ్చరించారు. కాల్పులు పూర్తిగా ఆగేంతవరకు ఎవరూ బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు. అనంతరం అటుగా దూసుకువచ్చిన ఉగ్రవాదులపై తన దగ్గర ఉన్న పిస్టల్ తో ఆయన కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు ఆయనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన మృతి చెందగా, అక్కడే ఉన్న విద్యార్థులు గోడదూకి బయటపడ్డారు. ఈ సందర్భంగా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ, ప్రొఫెసర్ సార్ తమను కాపాడారని అన్నారు.