: ఐఐటీ విద్యను వదిలేసి...ఆధ్యాత్మికతతో హిమాలయాలకు!: గుంటూరు విద్యార్థిని అదృశ్యం!
ఐఐటీ విద్యపై తనకు ఆసక్తి లేదని...ఆధ్యాత్మిక జీవనం వైపు వెళ్లిపోతున్నానంటూ మద్రాసు అడయారు ఐఐటీ విద్యార్థిని ఒక లేఖ రాసిపెట్టి అదృశ్యమైంది. ఈ మేరకు మద్రాసు ఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో పేర్కొన్న వివరాలు..ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్యూష(26) మద్రాసు అడయారులోని ఐఐటీలో ఎంఎస్ రెండో సంవత్సరం విద్య నభ్యసిస్తోంది. అక్కడి సబర్మతి హాస్టల్ లో ఉంటోంది. రెండు రోజులుగా ప్రత్యూష కనిపించకపోవడంతో తోటి విద్యార్థినులు కంగారుపడ్డారు. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ కు నిన్న తెలియజేశారు. వెంటనే స్పందించిన వార్డెన్ కొట్టూరుపురం పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యూష హాస్టల్ గదిలో తనిఖీలు నిర్వహించారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాసిన ఉత్తరం వారికి దొరికింది. ఆధ్యాత్మిక జీవనంపై తన మనస్సు లాగుతోందోని, రోజురోజుకు తన ఆసక్తి పెరుగుతోందని.. హిమాలయాలకు వెళుతున్నానని ఆ లేఖలో పేర్కొంది. అంతేకాకుండా, తన కోసం వెతకవద్దని, తన తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని తెలియజేయాలని కూడా ఆ లేఖలో ప్రత్యూష పేర్కొంది. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున ప్రత్యూష హాస్టల్ ను ఖాళీ చేసి వెళ్లిందని, ఆమె గుంటూరుకు చేరుకోలేదన్న సమాచారం తమకు తెలిసిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యూష తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని మద్రాసు ఐఐటీ అధికారులు తెలిపారు.