: హృదయ విదారకం... గర్భవతిగా ఉన్నప్పుడు మద్యం సేవించిన తల్లి... ఫలితంగా 43 ఏళ్ల కుమార్తె పరిస్థితి ఇది!


క్యాథీ మిచెల్... మీతో తన కథ చెప్పాలనుకుంటోంది. అందుకామె గర్వపడటం లేదు. కానీ అది నిజం. ఓ అభివృద్ధి చెందిన దేశంగా ఉన్న అమెరికాలో యువతీ, యువకులకు ఉన్న స్వేచ్ఛ తన జీవితాన్ని ఎంతటి భయంకర నరకంలోకి నెట్టిందో ఆమె ఇప్పుడు చెబుతుంటే, వినే వారి మనస్సు బాధతో నిండిపోతోంది. తన జీవితంలో చేసిన తప్పులు మరెవరూ చేయరాదని క్యాథీ సలహాలు ఇస్తోంది. అసలు విషయంలోకి వెళితే... క్యాథీ కుమార్తె కార్లీ. ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు. కానీ ఆమె మనస్సు ఒకటో తరగతి దగ్గరే ఆగిపోయింది. తన తల్లి, మారుతండ్రితో కలసి నివసిస్తోంది. బొమ్మలతో ఆడుకుంటుంది. స్టిక్కర్ బుక్ లను సేకరిస్తోంది. నాలుగు పదుల వయసులోనూ ఆమె ఇలా ఉండటానికి కారణం తాను చేసిన తప్పేనని ఇప్పుడు క్యాథీ వాపోతోంది. కార్లీ కడుపులో ఉండగా, తాను నిత్యమూ మద్యం సేవించేదాన్నని, దీంతో గర్భంలోని శిశువుపై తీవ్ర ప్రభావం పడిందని విలపిస్తోంది. కార్లీ ఎదుగుదల ఆరేళ్లకే పరిమితమైంది. వాహనాలు వస్తున్నా వీధిని దాటలేదు సరికదా, పొద్దున్నే పళ్లు తోముకోవాలన్నా చిన్న పిల్లల మాదిరిగా మారాం చేస్తుంది. "అయినా నేను కార్లీని ఎంతో ప్రేమిస్తున్నాను. ఆమె ఓ అమాయక చిన్నారి మాత్రమే. మద్యం నా జీవితంలో ఎంతటి ప్రమాదకారిగా మారిందన్నదానికి ఇది ఓ చిన్న ఉదాహరణ. ఈ తరహా ఘటన మరెవరికీ జరుగరాదు" అంటోంది. తాను మద్యానికి బానిసైన ఘటన పూర్వపరాలనూ చెప్పింది క్యాథీ. 1964 ప్రాంతంలో తాను 10 ఏళ్ల వయసులో ఉండగా, తన తల్లిదండ్రులు ఓ రెస్టారెంట్ ను తెరిచారని, తనకు ఊహ తెలుస్తున్న సమయంలో రాత్రి 8 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ కస్టమర్లు వచ్చి తాగడం, నృత్యాలు చేస్తూ ఆనందంగా ఉండటం తనకు తెలుసునని, ఆ సమయంలో ఒక పెగ్గుతో మొదలైన తన అలవాటు అలా అలా పెరిగిందని వెల్లడించింది. మద్యం సేవిస్తుంటే, తాను పెరుగుతున్నానని, మరింత అందంగా తయారవుతున్నానని అనిపించేదని, తన సోదరి వివాహ సమయంలో ఎన్ని బీర్లు తాగానో గుర్తే లేదని చెప్పింది. పదో తరగతిలోనే ఓ స్నేహితుడి కారణంగా గర్భవతిని అయ్యానని, ఆ సమయంలో నిత్యమూ మద్యం సేవించానని, అదే తన జీవిత గమనాన్ని సమూలంగా మార్చేసిందని వెల్లడించింది. అప్పట్లో "బొద్దుగా అందంగా ఉన్న సంతానం కావాలంటే, నిత్యమూ ఓ బీరు తాగండి" అని కొందరు చెప్పిన మాటలు తన మనసులో పాతుకుపోవడంతోనే ఇలా జరిగిందని, ఎవరూ అటువంటి మాటలు నమ్మవద్దని అంటోంది.

  • Loading...

More Telugu News