: హెచ్ సీయూలో మరింత వేడి... వర్సిటీకి నేడు జగన్, కేజ్రీ, మాయావతి, ఏచూరి
రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో రణరంగంగా మారిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నేడు మరింత వేడి రాజుకోనుంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లేఖే... రోహిత్ ఆత్మహత్యకు కారణమైందన్న వాదనల నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆకస్మికంగా వర్సిటీలో పర్యటించారు. రోహిత్ తల్లితో మాట్లాడిన రాహుల్ గాంధీ, ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై ఆరా తీసిన తర్వాత ఉద్రేకపూరిత ప్రసంగం చేశారు. రాహుల్ పర్యటనతో నిన్నంతా వర్సిటీలో విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు. తాజాగా నేడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్సిటీకి రానున్నారు. నిన్న ఉప్పల్ లోని రోహిత్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్, నేడు నేరుగా వర్సిటీకి రానున్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు కూడా నేడు వర్సిటీకి రానున్నారు. దళితుల పార్టీగా పేరుపడ్డ బీఎస్పీకి అధినేత్రిగా ఉన్న మాయావతి నిన్ననే ఇద్దరు అనుచరులను వర్సిటీకి పంపి ఘటనపై పూర్తి వివరాలు సేకరించారన్న వార్తలు వినిపించాయి. తాజాగా ఆమెనే స్వయంగా వర్సిటీకి రానుండటం, దేశంలోని పలువురు ప్రముఖులు కూడా ఆమె బాటే పట్టడం గమనార్హం.