: మైక్రోసాఫ్ట్ 'సెల్ఫీ యాప్'కు కొత్త వెర్షన్
ఐఓఎస్ యూజర్ల కోసం తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ 'సెల్ఫీ యాప్'కు ఇప్పుడు కొత్త హంగులద్దారు. 'మైక్రోసాఫ్ట్ సెల్ఫీ 2.0' వెర్షన్ తో యూజర్లు తాము తీసుకున్న ఫోటోలను క్షణాల్లో షేర్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. దాంతో పాటు కలర్ బ్యాలెన్స్, స్కిన్, లైటింగ్ వంటి సెట్టింగులను ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేస్తూ ఫోటోలను తీసుకునే విధంగా ఈ నూతన వెర్షన్ ను విడుదల చేశారు. డివైస్ కెమెరా ముందు ఉన్న వ్యక్తుల ఆకృతి, ఇతర హావభావాలకు అనుగుణంగా ఈ యాప్ ద్వారా సెల్ఫీలను తీసుకునే వీలు కూడా కల్పించారు. అంతేగాక తీసుకున్న ఫోటోలను మరింత అందంగా కనిపించేలా తయారు చేసుకునేందుకు 13 రకాలకు పైగా ఫిల్టర్లను కొత్త వెర్షన్ లో అందిస్తున్నారు. ఈ యాప్ కు కొత్త అప్ డేట్ ను కావాలనుకునే ఐఓఎస్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. త్వరలోనే ఈ యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ ను కూడా మైక్రోసాఫ్ట్ తీసుకురానుంది.