: హెచ్ సీయూలో యూపీ మాజీ సీఎం మాయావతి ప్రతినిధులు... రోహిత్ ఆత్మహత్యపై గుట్టుగా ఆరా
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్య రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్రం విచారణ కమిటీని హైదరాబాదు పంపింది. ఇద్దరు సభ్యులున్న సదరు కమిటీ కొద్దిసేపటి క్రితం వర్సిటీ ప్రాంగణంలో విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే, దళితులకు ప్రతినిధిగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి హెచ్ సీయూ ఘటనపై వేగంగా స్పందించారని తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కూడా దళిత సామాజిక వర్గానికి చెందనవారే. ఇతని ఆత్మహత్యకు దారి తీసిన అసలు కారణాలు ఏమిటనే విషయంపై గుట్టుగా ఆరా తీయాలని ఇద్దరు ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసిన మాయావతి వారిని హైదరాబాదు పంపినట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాదు చేరుకున్న వారు హెచ్ సీయూలో కాలిడినట్లు సమాచారం.