: ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ లో యువకుడి డెడ్ బాడీ... బర్త్ డే పార్టీలో విషాదం
హైదరాబాదు శివారులో నిన్న రాత్రి విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడి బర్త్ డే పార్టీకని వెళ్లిన వంశీకృష్ణ అనే యువకుడు శవంగా మారాడు. పలు అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ వ్యవహారానికి సంబంధించి రంగంలోకి దిగిన పోలీసులు బర్త్ డే పార్టీలో పాలుపంచుకున్న 17 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే... హైదరాబాదు శివారు ప్రాంతం చెంగిచర్ల పరిధిలోని మ్యారీగోల్డ్ ఫామ్ హౌస్ లోని నిన్న రాత్రి ఓ యువకుడి బర్త్ డే పార్టీ వేడుకగా జరిగింది. స్నేహితుడి బర్త్ డే వేడుకకు వంశీకృష్ణ అనే యువకుడు కూడా పాల్గొన్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు కాని, అతడు ఫామ్ హౌస్ లోని స్విమ్మింగ్ పూల్ లో శవమై తేలాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగారు. ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండానే బర్త్ డే పార్టీని నిర్వహించారని కేసు నమోదు చేశారు. వంశీకృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బర్త్ డే వేడుకకు వచ్చిన 17 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు దారి తీసిన కారణాలను వెలికితీసే పనిని ప్రారంభించారు.