: ఫలించిన అమెరికా వ్యూహం!...ఆర్థిక చిక్కుల్లో ఐఎస్, ఫైటర్ల వేతనం సగానికి తగ్గింపు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆర్థిక చిక్కుల్లో పడింది. అగ్రరాజ్యం అమెరికా వ్యూహాత్మక దాడుల కారణంగానే ఆ సంస్థ ఆర్థికంగా సతమతమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ఇరాక్, సిరియాల్లో తిష్ట వేసిన ఆ ఉగ్రవాద సంస్థ అక్కడి చమురు బావులు, సప్లై లైన్లను తన అధీనంలోకి తీసుకుంది. ఇరాక్, సిరియాల్లో సమాంతర పాలన సాగిస్తున్న ఆ సంస్థ పెద్ద ఎత్తున పన్నులను వసూలు చేస్తోంది. ఇక పలు వర్గాల నుంచి ఆ సంస్థకు పెద్ద ఎత్తున విరాళాలు అందాయి. వెరసి ప్రపంచంలోనే ఐఎస్ అత్యంత ధనిక ఉగ్రవాద సంస్థగా అవతరించింది. అమాయకులను తన వైపునకు తిప్పుకుంటున్న ఐఎస్, భారీ వేతనాలు ఇస్తూ ప్రపంచంపై భీకర దాడులు చేయిస్తోంది. ఐఎస్ ఉగ్రవాదుల దాడులతో గతేడాది సెప్టెంబర్ లోనే రంగంలోకి దిగిన అమెరికా, ఆ సంస్థ ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకుని దాడుల పరంపరకు తెర లేపింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఆధ్వర్యంలోని చమురు క్షేత్రాలతో పాటు సప్లైలైన్లు దెబ్బతిన్నాయి. ఇక ఐఎస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వైమానిక దాడులతో అమెరికా విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇటీవల ఐఎస్ కేపిటల్ గా మారిన రఖాపైనా అమెరికా ఫైటర్ జెట్లు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఐఎస్ వద్ద ఉన్న కరెన్సీ మొత్తం కాలిపోయింది. ఈ కారణంగా ఐఎస్ ఆర్థికంగా చితికిపోయింది. ఉన్న డబ్బు కాలిపోవడం, ఆదాయాన్నిచ్చే చమురు బావులు ధ్వంసం కావడం, విరాళాలు తగ్గడం... తదితర కారణాలతో సతమతమైన ఐఎస్ తన ఫైటర్ల వేతనాలను సగానికి సగం తగ్గించేసింది.