: కోర్టు ముందు ఎవరైనా ఒకటే...అందుకే విచారణకు హాజరయ్యా: తరుణ్ గొగోయ్
న్యాయస్థానం ముందు ఎవరైనా ఒకటేనని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తెలిపారు. పరువునష్టం దావా కేసులో కోర్టు ముందు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టం ముందు అంతా సామాన్యులేనని స్పష్టం చేశారు. కోర్టు ముందు ముఖ్యమంత్రి అయినా సామాన్యుడైనా ఒకటేనని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని ఆయన తెలిపారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై పోరాడుతానని ఆయన వివరించారు. కాగా, తరుణ్ గొగోయ్ కేబినెట్ మాజీ సభ్యుడైన హిమంత బిశ్వకర్మ తనపై తప్పుడు అవినీతి ఆరోపణలతో చర్యలు తీసుకున్నారని, తన పరువుకు భంగం కలిగించినందుకు తరుణ్ గొగోయ్ వంద కోట్లు చెల్లించాలని కోరుతూ కేసు వేశారు. ఈ సందర్భంగా ఆయన కేబినెట్ సహచరులు, స్థానిక నేతలు, కార్యకర్తలతో న్యాయస్ధానం ముందు హాజరయ్యారు. కాగా, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 8కి న్యాయస్థానం వాయిదా వేసింది.