: పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన కరుణానిధి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువునష్టం దావాపై నేడు చెన్నయ్ సెషన్స్ కోర్టులో విచారణ జరుగగా, డీఎంకే అధినేత కరుణానిధి కోర్టుకు హాజరయ్యారు. ఆయనకు మద్దతుగా తిరువళ్లూర్, కాంచీపురం తదితర జిల్లాల నుంచి భారీగా డీఎంకే కార్యకర్తలు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయగా, తమిళనాట కొంత ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఈ కేసులో విచారణ ప్రారంభించిన కోర్టు, కేసు తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ఓ పత్రికలో ప్రచురితమైన కథనం ఆధారంగా గత సంవత్సరం నవంబర్ 21న డీఎంకే పత్రికగా పేరున్న 'మురసోలి'లో ఓ ప్రకటన వెలువడింది. ఇది జయలలితకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో కూడుకున్నదని ఆరోపిస్తూ, కోర్టులో పరువునష్టం కేసు దాఖలు కాగా, దీన్ని విచారించిన న్యాయమూర్తి ఆదినాధన, కరుణానిధికి సమన్లు జారీ చేశారు. అందులో భాగంగానే కరుణానిధి నేడు కోర్టుకు హాజరయ్యారు. ఆయన వెంట కుమార్తె కనిమొళి, చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, పార్టీ నేతలు కోర్టుకు వచ్చారు.