: యువతితో తప్పుగా ప్రవర్తించిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ పై కేసు


బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ చిక్కుల్లో పడ్డాడు. కారు పార్కింగ్ దగ్గర వచ్చిన చిన్న వివాదంలో తనను దూషించాడని, తనపై తప్పుగా ప్రవర్తించాడని ఓ 24 ఏళ్ల మహిళ ముంబై పరిధిలోని వెర్సోవా పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీ సెక్షన్ 354పై కేసును పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు విషయమై నవాజుద్దీన్ స్పందన కోరాలని చూస్తే, ఆయన అందుబాటులో లేరు. నవాజ్ మేనేజరు అనూప్ పాండే మాత్రం ఈ ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. "ఇది ఓ తప్పుడు కేసు. విచారణ లేకుండానే పెట్టబడింది. అపార్టుమెంట్ సొసైటీలో దీర్ఘకాలంగా విభేదాలున్నాయి. వాటి నేపథ్యంలోనే కేసు తెరపైకి వచ్చింది. కేవలం వాదన జరిగింద తప్ప ఆయన చెయ్యి చేసుకోలేదు. మేం విచారణకు సహకరిస్తాం" అని అన్నారు. కాగా, అంధేరీ శివార్లలోని యారీ రోడ్డులో ఉన్న హౌసింగ్ సొసైటీలో కార్లను పార్కింగ్ చేసుకునే స్థలం విషయమై బాధితురాలు, నవాజ్ మధ్య కొద్దికాలంగా గొడవ జరుగుతున్నట్టు తెలుస్తోంది. టూ వీలర్ల కోసం నిర్దేశించిన ప్రాంతంలో నవాజ్ తన కారును పదేపదే పార్కింగ్ చేస్తుండటమే వివాదం వెనుక ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News