: హక్కుల కార్యకర్తలు అరుణ్ రాయ్, నిఖిల్ దేవ్ పై దగ్గరుండి దాడి చేయించిన బీజేపీ నేత


అధికారం మనదే కదా అన్న తలబిరుసుతనంతో, ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలు అరుణ్ రాయ్, నిఖిల్ దేవ్ లపై దగ్గరుండి దాడి చేయించిన ఓ బీజేపీ నేత చిక్కుల్లో పడ్డారు. రాజస్థాన్ లోని అల్ కేరా నియోజకవర్గ ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనా, తన అనుచరులతో దాడి చేయిస్తున్న దృశ్యాలు వీడియోకు చిక్కగా, బీజేపీ అధిష్ఠానం అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. జలావర్ జిల్లాలో పరిపాలన పారదర్శకంగా ఉండాలంటూ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 'సూచనా ఏవం రోజ్ గార్ మంచ్' సంస్థ నడుంబిగించగా, దాదాపు 40 మంది బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ ఆందోళనకారులకు మీనా నాయకత్వం వహించారు. పెద్ద పెద్ద కర్రలు తీసుకుని హక్కుల కార్యకర్తల వెంట పడ్డారు. ఇష్టానుసారం బాదేశారు. ఈ ఘటనలో మొత్తం 12 మందికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేశామని, నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో ఈ ఘటన జరగడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడులు జరపాలని ముందుగా ప్రణాళిక వేసుకున్నారని నిఖిల్ దేవ్ ఆరోపించారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం లేదని, సుపరిపాలనే లక్ష్యంగా సాగుతున్నామని అన్నారు. ఈ దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News