: పోలీసులపై రాళ్లు రువ్విన స్టూడెంట్స్... సెంట్రల్ వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న సాయంత్రం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారన్న మనోవేదనతో గుంటూరు జిల్లాకు చెందిన రిసెర్చి స్కాలర్ రోహిత్ (28) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వర్సిటీలో చోటుచేసుకున్న ఘర్షణలను కారణంగా చూపిన వర్సిటీ అధికారులు రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని 14 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నా, వర్సిటీ అధికారులు ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రోహిత్ హాస్టల్ గదిలోనే ఉరేసుకుని తనువు చాలించాడు. ఘర్షణలకు దిగిన ఓ వర్గం విద్యార్థులకు కొమ్ము కాస్తూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వర్సిటీ అధికారులకు ఓ లేఖ రాశారని రోహిత్ వర్గానికి చెందిన విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ లేఖ కారణంగానే రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులను వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించిన పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని హాస్టల్ లో ఉంచి గేట్లకు తాళాలేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు విద్యార్థులను నిలువరించే యత్నం చేశారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. తక్షణమే వర్సిటీ నుంచి బయటకు వెళ్లాలని వారు పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.