: టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కు అగ్రస్థానం... సఫారీల పేలవ ప్రదర్శనే లాభించింది!


అదేంటీ, మొన్న సఫారీలపై టెస్టు సిరీస్ నెగ్గినా లభించని అగ్రస్థానం టీమిండియాకు ఇప్పుడెలా వచ్చింది? అని ఆలోచిస్తున్నారా? అందుకు మనోళ్ల వీర విహారమేమీ కారణం కాదులెండి. మనపై టెస్టు సిరీస్ లో ఓటమిపాలైన దక్షిణాఫ్రికా జట్టు తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లోనూ పరాజయం పాలైంది. వరుసగా మూడు టెస్టు మ్యాచ్ ల్లో ఓటమిపాలైన సఫారీలు, సిరీస్ ను ఇంగ్లండ్ కు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటిదాకా అగ్రస్థానంలో ఉన్న సఫారీ టెస్టు జట్టు కాస్తా, ఓ మెట్టు కిందకు దిగక తప్పలేదు. దీంతో రెండో స్థానంలో ఉన్న టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా 2011కు ముందు టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే 2011లో ఇంగ్లండ్ చేతిలో వరుసగా నాలుగు టెస్టులు ఓడిన టీమిండియా నాడు ఆ ర్యాంకును కోల్పోయింది. తాజాగా ఇంగ్లండ్ వీర విహారంతోనే సదరు టాప్ ర్యాంకు మళ్లీ భారత్ దరిచేరడం విశేషం. ఇక ఇంగ్లండ్ తో జరగనున్న నాలుగో టెస్టులో సఫారీలు గెలిచినా, మ్యాచ్ ను డ్రా చేసుకున్నా కూడా మళ్లీ ఆ జట్టే అగ్రస్థానానికి చేరనుంది. అంటే, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల మధ్య జరగనున్న నాలుగో టెస్టు టీమిండియా ర్యాంక్ ను మర్చేయనుందన్న మాట.

  • Loading...

More Telugu News