: పలు రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే పోటీలో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ పలు వరల్డ్ రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డేల్లో 7 వేల పరుగుల మైలురాయిని అతి తక్కువ ఇన్నింగ్స్ లో చేరుకున్న ఘనుడిగా చరిత్రలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు సౌరవ్ గంగూలీ (174 ఇన్నింగ్స్) పేరిట ఉండగా, తన 169వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ ఆ రికార్డును (161 ఇన్నింగ్స్) అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో 7 వేల పరుగులు చేరిన బ్యాట్స్ మన్లు 36 మంది ఉండగా, వారిలో సచిన్ ఎవరికీ అందనంత ఎత్తున ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సెంచరీతో కోహ్లీ సాధించిన మరో రికార్డు... ఆస్ట్రేలియాలో అత్యధిక సెంచరీలు సాధించిన విదేశీ ఆటగాళ్లలో టాప్-4కి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాపై సచిన్ 20 సెంచరీలు సాధించగా, ఆపై ఇంగ్లండ్ కు చెందిన జేబీ హాబ్స్, వెస్టిండీస్ కు చెందిన బ్రియాన్ లారాలు 12 సెంచరీలతో ఇంగ్లండ్ కు చెందిన డీఐ గోవర్, వెస్టిండీస్ కు చెందిన డీఎల్ హేన్స్ 11 సెంచరీలతో ఉండగా, వీవీఎస్ లక్ష్మణ్, కోహ్లీలు చెరో 10 సెంచరీలు చేసి నాలుగో స్థానంలో ఉన్నారు. ఆసియా బయట కోహ్లీ వరుసగా మూడు మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలకు పైగా చేయడం కూడా ఇదే తొలిసారి.