: ఇక 15 ఏళ్లకే ఆర్జేడీలో చేరిపోవచ్చు!
బీహార్ లో 15 ఏళ్లలోపు వారిని కూడా తమ పార్టీలో కార్యకర్తలుగా చేర్చుకోవాలని రాష్ట్రీయ జనతాదళ్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే కార్యకర్తలుగా సభ్యత్వం ఇస్తుండగా, మారిన పరిస్థితులను అనుసరించి, 15 ఏళ్ల దాటిన వారిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ ప్రతినిధి చిత్తరంజన్ గగన్ వెల్లడించారు. ఇకపై తమ పార్టీ సభ్యుల్లో ఎవరైనా ఏ పదవినైనా దక్కించుకోవచ్చని ఆయన తెలిపారు. ఇదే సమయంలో జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రస్తుతమున్న 75 మంది సభ్యులను 85 మందికి పెంచుతూ కూడా నిబంధనలను మార్చినట్టు ఆయన తెలిపారు. జాతీయ కమిటీలో ఒక అధ్యక్షుడు, ఐదుగురు ఉపాధ్యక్షులు, ఒక సెక్రటరీ జనరల్, ఒక ట్రెజరర్, 12 మంది సాధారణ కార్యదర్శులు, 12 మంది కార్యదర్శులు ఉంటారని గగన్ తెలిపారు. ఇకపై రాష్ట్రాల అధ్యక్షులు 51 మందితో కార్యవర్గాన్ని నియమించుకోవచ్చని వివరించారు.