: మా ముందున్నవి రెండే లక్ష్యాలు: ధోనీ
టీమిండియా ముందున్నవి రెండే లక్ష్యాలని కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు. బ్రిస్బేన్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యర్థికి 300 పరుగుల లక్ష్యం సరిపోవడం లేదని చెప్పాడు. టీమిండియా ఆటతీరు నాసిరకంగా లేదని, 300 పరుగులు అంటే భారీ స్కోరు అన్న విషయం గుర్తించాలని ధోనీ చెప్పాడు. అయితే ప్రత్యర్థికి ఈ స్కోరు సరిపోవడం లేదని, మెల్ బోర్న్ లో జరగనున్న మూడో వన్డేలో 330 పైచిలుకు లక్ష్యం నిర్దేశించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. తమ ముందు ప్రత్యర్థిని కట్టడి చేయడం, లేదా భారీ లక్ష్యం నిర్దేశించడం అనే రెండు లక్ష్యాలు ఉన్నాయని, తొలిదాని కంటే రెండోదే చేయడానికి ప్రయత్నిస్తామని ధోనీ చెప్పాడు. తద్వారా బౌలర్ల నుంచి అద్భుతాలు ఆశించడం లేదని చెప్పకనే చెప్పాడు. రెండో వన్డేలో స్టేడియం అన్ని వైపుల నుంచి గాలి వీయడంతో ఇషాంత్ శర్మ స్వింగ్ రాబట్టలేకపోయాడని ధోనీ చెప్పాడు. కాగా, ఈ సిరీస్ లో రెండు వరుస పరాజయాలతో టీమిండియా వెనుకబడిన సంగతి తెలిసిందే.