: నెటిజన్ల విమర్శలను మరోసారి నిజం చేసిన రోహిత్ శర్మ
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ నెటిజన్ల విమర్శలను మరోసారి నిజం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కొన్ని మూఢ నమ్మకాలు ఉంటాయి. నమ్మకాలు మూఢమైనప్పటికీ వాటి ప్రభావం బలంగా ఉంటుంది. అలాంటి నమ్మకమే టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ ప్రదర్శనపై ఉంది. రోహిత్ శర్మ సెంచరీ చేస్తే టీమిండియా ఓటమిపాలవుతుందనే నమ్మకం ఒకటి నెలకొంది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ 171 పరుగులు చేసినప్పటికీ ఓటమిపాలవ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యం ప్రదర్శించారు. రోహిత్ సెంచరీ చేస్తే టీమిండియా ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. రెండో వన్డేలో కూడా రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. టీమిండియా ఆటగాళ్లు ఆసీస్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో రోహిత్ శర్మ 124 పరుగులు సాధించాడు. స్కోరు బోర్డు మీద 309 పరుగుల విజయ లక్ష్యం ఉంచినప్పటికీ ఆసీస్ ఆటగాళ్లు సునాయాసంగా విజయం సాధించారు. దీంతో మళ్లీ రోహిత్ సెంచరీపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మరి రోహిత్ శర్మపై పడిన ఈ అపవాదు ఎప్పుడు పోతుందోనని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.