: సినిమా థియేటర్ లో బాంబు ఉందంటూ ఆగంతుకుడి ఫోన్... బెంగళూరులో కలకలం
కర్ణాటక రాజధాని బెంగళూరులో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. నగరంలోని ఓ సినిమా థియేటర్ లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి, వివిధ దేశాల్లోని నగరాల్లో ఉగ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో బెంగళూరు పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. బాంబు ఉందని భావిస్తున్న థియేటర్ లో ముమ్మర సోదాలు చేశారు. ఈ సోదాల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ బ్యాగ్ ను పోలీసులు గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకుని బాంబ్ స్క్వాడ్ ను రప్పించారు. థియేటర్ లో బాంబు ఉందన్న వార్తలు క్షణాల్లో నగరం నలుమూలలకూ చేరిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.