: పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలపై వివాదం... అత్తిలిలో టీడీపీ నేతలు, పవన్ అభిమానుల మధ్య రగడ
తెలుగు నాట మరోమారు సినీ హీరోల ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే, వాటిని టీడీపీ నేతలు ధ్వంసం చేశారని అభిమానులు ఆందోళన చేయడంతో పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ అభిమాన నటుడి ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకుంటే, టీడీపీ నేతలకేం ఇబ్బంది? అంటూ పవన్ అభిమానులు ఫైరయ్యారు. వివరాల్లోకెళితే... సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అత్తిలిలో పవన్ ఫ్లెక్సీలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే రోడ్డుకు కాస్తంత అడ్డంగా ఉందన్న కారణంగా సదరు ఫ్లెక్పీని టీడీపీ నేత ఒకరు తొలగించారట. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పవన్ అభిమానులు... ఫ్లెక్సీ చిరిగిపోయి ఉండటాన్ని గుర్తించారు. దీంతో అక్కడే ఆందోళనకు దిగిన పవన్ అభిమానులు ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడి ఫ్లెక్సీని తొలగించడమే కాక కింద పడేసి తొక్కిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. తమపై నిందలేస్తున్న పవన్ అభిమానులపై కేసులు నమోదు చేయాలని వారు కూడా ప్రతి నినాదాలు చేశారు. ఇరువర్గాలు రాత్రి పొద్దుపోయే దాకా అక్కడే బైఠాయించాయి. గంటల తరబడి ఇరు వర్గాలకు సర్ది చెప్పిన పోలీసులు ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత వారిని అక్కడి నుంచి పంపేశారు.