: ‘పఠాన్ కోట్’ ముష్కరులు పాక్ జాతీయులే!...విస్పష్టంగా ప్రకటించిన జైషే మిలిటెంట్
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి పాల్పడింది పాకిస్థాన్ జాతీయులేనని ఈ దాడులకు సూత్రధారిగా వ్యవహరించిన ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ ప్రకటించింది. ఈ మేరకు నిన్న ‘హిందుస్థాన్ టైమ్స్’ ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడిన ఆ సంస్థ మిలిటెంట్ సైఫుల్లా ఖలీద్ స్పష్టం చేశాడు. ‘‘పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన సంస్థలు ఏవన్న విషయాన్ని పక్కనబెడితే... దాడుల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకుంది మాత్రం పాక్ కు చెందిన ముజాహిదీన్లే’’ అని అతడు విస్పష్టంగా ప్రకటించాడు. కాశ్మీర్ సహా భారత్ లోని ముస్లింలకు స్వేచ్ఛ లభించే దాకా దాడులు కొనసాగిస్తామని కూడా అతడు చెప్పాడు. ‘‘కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరు కొనసాగిస్తాం. బాబ్రీ మసీదు విధ్వంసం, గుజరాత్ ముస్లింలపై జరిగిన దాడికి ప్రతీకారంగా దాడులు కొనసాగిస్తాం. అల్లా ఆదేశాల మేరకే పోరాటం కొనసాగిస్తున్నాం. అందరూ చెప్పుకుంటున్నట్లు పాక్ నగరం బహవల్పూర్ లో మా శిక్షణా కేంద్రమేమీ లేదు. అయితే అక్కడ మా జనం ఉన్నారు. శిక్షణా శిబిరాలను ఎప్పటికప్పుడు మారుస్తూ కార్యకలాపాలు సాగిస్తాం’’ అని అతడు మరిన్ని వివరాలు కూడా చెప్పాడు.