: టీవీ కమేడియన్ కి బాలీవుడ్ మద్దతు
డేరా సచ్ఛాసౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రాంరహీమ్ సింగ్ ను విమర్శించాడంటూ అరెస్టైన 'కామెడీ నైట్ విత్ కపిల్' షో నటుడు (పలక్) కికు శార్ధకు బాలీవుడ్ నటులంతా మద్దతు పలుకుతున్నారు. మిమిక్రీ చేయడం కూడా తప్పంటే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ ద్వారా...కేవలం ఆరోతరగతి పాసై...ఎంఎస్ జీ వంటి సినిమా తీసిన గుర్మీత్ రాం రహీంను ఎందుకు అరెస్టు చేయలేదు? అని అడిగారు. గుర్మీత్ రాం రహీం రాక్ స్టార్ పోజులో ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్లో పెట్టిన బాలీవుడ్ వెటరన్ నటుడు రిషి కపూర్, 'తాను రాక్ స్టార్ లా నటించాలని అనుకుంటున్నానని, చూద్దాం ఎవరు తనను అరెస్టు చేస్తారో' అని వ్యాఖ్యానించారు. కాగా, కమెడియన్ ను అరెస్టు చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. కలియుగంలోనే ఇలాంటి పనులు జరుగుతాయని పలువురు వ్యాఖ్యానించడం విశేషం. గుర్మీత్ ను అనుకరించాడని ఆరోపిస్తూ ఆయన అనుచరులు కేసు పెట్టడంతో కికు శార్దను అరెస్టు చేసిన పోలీసులు, బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.