: సంక్రాంతి 'పెట్రో' శుభవార్త... ప్రయోజనం ప్రజలకు దక్కేనా?


అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 12 ఏళ్ల కనిష్ఠానికి చేరిన వేళ, భారత ముడిచమురు బాస్కెట్ ధర 30 డాలర్ల దిగువకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రతి రెండు వారాలకూ ఒకసారి పెట్రోలు, డీజెల్ ధరలను సవరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు సంక్రాంతి కానుకగా, రూ. 3 వరకూ పెట్రోలు ధరను, రూ. 2.50 వరకూ డీజెల్ ధరలను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో 'పెట్రో' ఉత్పత్తుల ధరలను తగ్గించగానే, ఆ మేరకు పన్నులను పెంచుకోవడంపైనే దృష్టిని సారించిన కేంద్రం ఈ దఫా కూడా అదే దారిలో నడిస్తే మాత్రం ప్రయోజనం ప్రజలకు దక్కే అవకాశాలు మృగ్యమే. కాగా, గురువారం నాటి సెషన్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర మరింతగా పతనమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 1.5 శాతం పతనమై 29.73 డాలర్లకు చేరింది. ఇక వెస్ట్ టెక్సాస్ ముడిచమురు ధర 12 సెంట్లు పడిపోయి 30.36 డాలర్లకు చేరింది. గత పుష్కర కాలంలో క్రూడాయిల్ ధర ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. ఒపెక్ సమావేశంలో ముడిచమురు ఉత్పత్తిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోవడంతోనే ధరలు మరింతగా తగ్గుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News