: మరాఠీల మనసులూ గెలిచిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!


సీనియర్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ గుర్తున్నారుగా? లేకుంటే... ఒక్కసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణం, ఎమ్మార్ ప్రాపర్టీస్ అవకతవకల కేసులను గుర్తుకు తెచ్చుకోండి. లక్ష్మీనారాయణ కూడా గుర్తుకు వస్తారు. తెలుగు నేలపై కలకలం రేపిన సదరు కేసులను రోజుల వ్యవధిలో ఛేదించిన లక్ష్మీనారాయణ తెలుగు నేలకు చెందినవారే. ఐపీఎస్ అధికారిగా ఎంపికైన ఆయనను కేంద్రం మహారాష్ట్ర కేడర్ కు కేటాయించింది. అయితే కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్లిన ఆయన సీబీఐ జేడీగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. సెంట్రల్ సర్వీసుల డిప్యూటేషన్ పూర్తైన నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసు పూర్తి కాకుండానే ఆయన మహారాష్ట్రకు వెళ్లిపోవాల్సి వచ్చింది. నాడు ఆయన బదిలీపై తెలుగు నేలలో పెద్ద చర్చే నడిచింది. మెజారిటీ ప్రజలు ఆయన బదిలీని నిలుపుదల చేయాలనే కోరారు. సర్వీసు రూల్స్ ప్రకారం అది కుదరదని తెలిసినా, ప్రజలు అలా కోరుకున్నారు. ఎందుకంటే లక్ష్మీనారాయణలోని నిజాయతీనే జనాన్ని ఆ భావనకు వచ్చేలా చేసింది. ఇక మహారాష్ట్రకు వెళ్లిన ఆయన అక్కడ కూడా తన నిజాయతీని వదలలేదు. నిక్కచ్చితనాన్ని అంతకన్నా వదలలేదు. ఎక్కడ పనిచేసినా, ఆయన నైజమే అది. మహారాష్ట్రలోని థానే నగర జాయింట్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన అక్కడి నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. మకిలీ అంటిన ఖాకీలనూ ఆయన ఉపేక్షించలేదు. అక్రమంగా నడుస్తున్న డ్యాన్స్ బార్లతో పాటు పేకాట క్లబ్బులను క్లోజ్ చేసేశారు. ఒక బిల్డర్ హత్య కేసులో నలుగురు కార్పోరేటర్లను కూడా ఆయన కటకటాల వెనక్కి తోసేశారు. వెరసి అక్కడి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న లక్ష్మీనారాయణకు ఈ సారీ సర్వీసు నిబంధనలే బదిలీకి కారణమవుతున్నాయి. జాయింట్ కమిషనర్ స్థాయి నుంచి ఆయన అదనపు డీజీగా పదోన్నతి పొందారు. దీంతో ఆయనను అదనపు డీజీ (పరిపాలన)గా నియమించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో నగరంలో అల్లరి మూకలు, నేరగాళ్లకు సింహస్వప్నంలా మారిన ఆయనను బదిలీ చేయొద్దని థానే ప్రజలు కోరుతున్నారు. ఆయన బదిలీని రద్దు చేయాలంటూ నగరంలో ప్లెక్సీలు కూడా వెలిశాయి. ప్రజలే కాదండోయ్, ఆయన నిజాయతీకి సెల్యూట్ చేస్తున్న పోలీసులు కూడా లక్ష్మీనారాయణ బదిలీని ఇష్టపడటం లేదట.

  • Loading...

More Telugu News