: ఐఎస్ఐఎస్ కు చెందిన ధనరాశులను ధ్వంసం చేసిన అమెరికా
ఐఎస్ఐఎస్ ను అమెరికా బలంగా దెబ్బకొట్టింది. ఇరాక్ లోని ఐఎస్ స్వాధీనంలో ఉన్న సెంట్రల్ మోసూల్ పట్టణంలోని ఓ భవనంపై అమెరికా దళాలు బాంబులు కురిపించాయి. ఈ దాడుల్లో ఐఎస్ ఆర్థిక మూలాలు కదిలినట్టు తెలుస్తోంది. అమెరికా ప్రయోగించిన రెండు వేల పౌండ్ల బరువు ఉన్న రెండు బాంబులు ఐఎస్ తీవ్రవాదులు మిలియన్ల కొద్దీ ధనాన్ని దాచుకున్న భవనంపై పడ్డాయి. దీంతో ఈ భవనం మొత్తం శిథిలమైపోయింది. అయితే ఆ భవనంలో ఏ దేశానికి చెందిన కరెన్సీ ఉంది? అది ఎంత మొత్తం? అన్న వివరాలు అధికారికంగా తెలియలేదని, కానీ మిలియన్ల కొద్దీ డబ్బు నాశనమైందని మాత్రం అమెరికా పేర్కొంది. బాంబు దాడుల్లో సాధారణ ప్రజలు మృతి చెందుతున్నారని భావించిన అమెరికా ఐఎస్ఐఎస్ ఆర్థిక స్థావరాలపై డ్రోన్ లతో నిఘా పెట్టింది. ఆ సందర్భంగా పగలు సాధారణ పౌరులు పని చేయడం, రాత్రుళ్లు ఐఎస్ తీవ్రవాదులు అక్కడ విధులు నిర్వర్తించడం గుర్తించిన అమెరికా బలగాలు, జనసంచారం లేదని నిర్ధారణ కాగానే ఐఎస్ ఆర్థికమూలాలపై బాంబుల వర్షం కురిపించింది.