: పెళ్లంటే ఇలా వుండాలి... సరికొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పిన నూతన దంపతులు!
వివాహం జీవితంలో ఒకేసారి చేసుకునే వేడుక...అందుకే, ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారు ఈ వేడుకను జరుపుకుంటారు. అయితే, స్థాయిని మించి ఖర్చు చేసి, అప్పులపాలయ్యేవారు కూడా కొందరుంటారు. అలాంటి వారందరికీ గుజరాత్ లోని గాంధీనగర్ లో తాజాగా వివాహం చేసుకున్న నూతన దంపతులు ఆదర్శంగా నిలిచారు. హల్దారు గ్రామానికి చెందిన నిషాద్ బాను వాజిఫ్ దార్ (22) కు రమీజ్ మొహ్మద్ తో జనవరి 10న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. దీంతో, వివాహంపై ఆమె తన అభిప్రాయం వెల్లడించగా, ఆమెకు చేదోడుగా ఉంటామని కాబోయే భర్త, తండ్రి భరోసా ఇచ్చారు. దీంతో ఆమె తనతో పాటు చదువుకున్న అందర్నీ వివాహానికి ఆహ్వానించింది. అలాగే నర్సరీ నుంచి ఎంసీఏ వరకు తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులందర్నీ ఆహ్వానించింది. సాదాసీదాగా వివాహం చేసుకున్న ఆమె, వివాహ తంతు ముగిసిన వెంటనే తనకు విద్యాబుద్ధులు నేర్పిన 75 మంది రిటైర్డ్ గురువులను దుశ్శాలువ, మెమెంటోతో సత్కరించింది. అలాగే గ్రామం నుంచి ఉన్నత విద్యనభ్యసించిన ప్రతి ఒక్కరినీ ఆమె సత్కరించింది. అనంతరం తనలాగే చాలా మందికి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని, తాను చదివిన పాఠశాలల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని కోరుతూ పది లక్షల రూపాయలు విరాళంగా అందజేసింది. అనంతరం ఏర్పాటు చేసిన భోజనం కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ఆమె ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించగా, తాను ప్రచారం కోసం ఆ పనులు చేయడంలేదని, దయచేసి అలాంటి ప్రయత్నం చేయవద్దని, భోజనం చేసి వెళ్లాలని కోరింది. ఆమె వివాహం ద్వారా సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారని, విషయం తెలిసిన ప్రతిఒక్కరూ ఆమెను అభినందిస్తున్నారు.