: పూణే ఏటీఎస్ అధికారిని చంపేస్తామంటూ ఐఎస్ లేఖ... బాలిక మనసు మార్చడమే కారణం!


ప్రపంచ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ముష్కరుల నుంచి రెండు వారాల క్రితం మహారాష్ట్ర రాజధాని ముంబై నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఓ లేఖ వచ్చింది. మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం(యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్... ఏటీఎస్)లోని పూణే శాఖలో పనిచేస్తున్న భానుప్రతాప్ బర్గేను చంపేస్తామంటూ ఐఎస్ ఉగ్రవాది ఒకరు సదరు లేఖలో హెచ్చరించాడు. బర్గేతో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని కూడా కడతేరుస్తామని కూడా ఆ ఉగ్రవాది హెచ్చరించాడు. అసలు బర్గేను ఉగ్రవాదులు టార్గెట్ చేయడానికి కారణమేంటని ఆరా తీస్తే... ఆసక్తికర కోణం వెలుగు చూసింది. ఇటీవల ఐఎస్ భావజాలానికి ఆకర్షితురాలైన ఓ ఇంటర్మీడియట్ అమ్మాయి సిరియాకు వెళ్లేందుకు దాదాపుగా నిర్ణయించుకుంది. పూణేలోని సంపన్న కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి నిత్యం ఐఎస్ ముష్కరులతో ఆన్ లైన్ లో చర్చలు జరుపుతూ ఏటీఎస్ నిఘాకు చిక్కిపోయింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన భానుప్రతాప్ బర్గే... సదరు బాలికను గుర్తించారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఐఎస్ చేస్తున్న మారణ హోమాన్ని, దాని వెనకున్న అసలు లక్ష్యాలను సవివరంగా ఆ అమ్మాయి ముందు పెట్టారు. దీంతో ముష్కరుల నిజ స్వరూపం తెలుసుకున్న ఆ బాలిక ఐఎస్ బాట పట్టే సమస్యే లేదని తేల్చిచెప్పింది. దీనిపై పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమయ్యాయి. తమ వైపు ఆకర్షితురాలైన ఆ బాలిక మనసు మార్చిన బర్గేపై ఐఎస్ కక్ష గట్టింది. అందులో భాగంగానే చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రాసింది. ఈ లేఖపై కేసు నమోదు చేసిన ఏటీఎస్ దర్యాప్తు ప్రారంభించింది.

  • Loading...

More Telugu News