: కేసీఆర్ ను పల్లెత్తు మాట అనని చంద్రబాబు!


అవకాశం దొరికితే విమర్శల మీద విమర్శలు గుప్పించుకునే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిరిందా? ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నారా? హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ, నిజాం కళాశాల మైదానంలో జరిగిన సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరునుగానీ, టీఆర్ఎస్ పార్టీ పేరునుగానీ ఒక్కమారు కూడా ప్రస్తావించకపోవడం పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఆయన ప్రసంగం సైతం చప్పగా సాగిందని కార్యకర్తలు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేసభలో అంతకుముందు మాట్లాడిన ఆర్.కృష్ణయ్య, తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే, కేసీఆర్ ను బట్టలూడదీసి కొట్టిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేయగా, టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి సైతం అంతే ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ సైతం తన ప్రసంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లో తన హయాంలో జరిగిన అభివృద్ధిపైన, అంటే, పదేళ్ల క్రితం వరకూ జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ మాట్లాడారు. టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని అడిగారే తప్ప, గెలిస్తే తామేం చేస్తామన్న విషయమై ఒక్క మాట కూడా చెప్పలేదు. పాలిస్తున్న ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం ఒక్కసారైనా చేయకపోవడం గమనార్హం. గ్రేటర్ ప్రజలు మనస్సాక్షితో ఓటేయాలని చెప్పిన చంద్రబాబునాయుడు తన ప్రసంగం ముగించగా, కార్యకర్తలు నిరాశతో వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News