: 92 ఏళ్ల బామ్మగారి భరతనాట్యం అదుర్స్!
అడుగుతీసి అడుగు వేయలేని వయస్సులో ఉన్న ఈ బామ్మ గారు ఏకంగా భరతనాట్యమే చేసింది. ఆమె భరతనాట్యం షో అదిరిపోయిందని చెప్పడానికి ప్రేక్షకుల మన్ననలే నిదర్శనం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే ఆరు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. మరి ఈ బామ్మగారి వివరాల గురించి చెప్పాలంటే.. క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె పేరు భానుమతి రావు. వయస్సు 92. గత డిసెంబర్ 5వ తేదీన అభినయ గ్రూపు తరపున బెంగళూరులోని భారతీయ విద్యా భవన్ లో భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. ‘కృష్ణా నీ బెగానే బరో...’ అనే ప్రసిద్ధ శాస్త్రీయ గీతానికి భానుమతి రావు చేసిన నృత్యం ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘డ్యాన్స్ అంటే హావభావాలను పలికించే అద్భుతమైన కళ. పాట, శరీరం మమేకమైపోతాయి. నా కళను ఇతరులతో పంచుకోవాలన్న ఆసక్తి నాకు బాగా ఉంటుంది’ అని ఆమె పేర్కొన్నారు. వయస్సు పైబడటంతో వినికిడి, కొద్దిగా జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తినప్పటికీ తన జీవితం నుంచి నృత్యాన్ని విడదీసి చూడలేమని భానుమతిరావు పేర్కొన్నారు. 1923లో కోజికోడ్ లో ఆమె జన్మించారు. ఉన్నత విద్య నిమిత్తం 22 సంవత్సరాల వయస్సులో ఆమె లండన్ కు వెళ్లింది. లైబ్రరీ సైన్స్ విద్యనభ్యసించిన తాను, ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ రామ్ గోపాల్ కు చెందిన ట్రూప్ లో సభ్యురాలిగా చేరానని గత విషయాలను భానుమతిరావు నెమరువేసుకున్నారు.