: 'జల్లికట్టు' కేసును విచారించలేనంటూ తప్పుకున్న సుప్రీం న్యాయమూర్తి, కేంద్రం ఆదేశాలపై స్టే
మరో రెండు రోజుల్లో సంక్రాంతి పర్వదినం రానున్న సందర్భంగా తమిళనాడులో జరిగే సంప్రదాయ 'జల్లికట్టు' పోరును ఆపాలని దాఖలైన పిటిషన్ పై తాను విచారణ జరపలేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్.భానుమతి సంచలన ప్రకటన చేశారు. గతంలో తాను మద్రాస్ హైకోర్టులో పనిచేశానని చెప్పిన ఆమె, విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. తమిళనాట, జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పెటా సహా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పండగ దగ్గర పడిందని, త్వరగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు నిన్న కోరగా, నేడు విచారిస్తామని వెల్లడించిన ధర్మాసనం, విచారణ ప్రక్రియ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడంతో డైలమాలో పడింది. ఆపై కేసును విచారించిన మరో ధర్మాసనం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ పై స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. పిటిషన్లపై సమాధానమివ్వాలని కేంద్రానికి, తమిళనాడు సర్కారుకు నోటీసులు జారీ చేసింది.