: కల్తీ మద్యం కేసులో 9 మందికి బెయిల్... మల్లాది మాత్రం జైల్లోనే!
విజయవాడలో కలకలం రేపిన కల్తీ మద్యం కేసులో అరెస్టైన నిందితులకు కొద్దిసేపటి క్రితం స్వల్ప ఊరట లభించింది. విజయవాడలోని కృష్ణలంకలో కార్యకలాపాలు సాగిస్తున్న స్వర్ణ బార్ లో కల్తీ మద్యం తాగిన ఐదుగురు కూలీలు చనిపోగా, 25 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ మద్యం వెలుగుచూసిన స్వర్ణ బార్... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందినది కావడంతో వేగంగా స్పందించిన ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సిట్ స్వర్ణ బార్ లో పనిచేస్తున్న మేనేజర్ సహా మొత్తం 9 మంది సిబ్బందిని అరెస్ట్ చేసింది. దాదాపు నెల తర్వాత ఇటీవలే తమ ముందు విచారణకు హాజరైన మల్లాది విష్ణుతో పాటు ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్ ను కూడా అరెస్ట్ చేసింది. నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం విచారించిన విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 9 మంది బార్ సిబ్బందికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే ఇటీవలే అరెస్టైన మల్లాది బ్రదర్స్ మాత్రం ఇంకా జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.