: మరాఠా ‘స్థానిక’ పోరులో సత్తా చాటిన కాంగ్రెస్... నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ
వరుస ఓటములతో తలబొప్పి కట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ వార్త కాస్తంత ఊరటనిచ్చేదే. మహారాష్ట్రలో రెండు రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. మొత్తం 345 వార్డులకు ఎన్నికలు జరగగా... ఒంటరిగానే బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 105 సీట్లను కైవసం చేసుకుంది. ఇక కేంద్రంలోనే కాక మహారాష్ట్రలోనూ అధికారం చేజిక్కించుకున్న బీజేపీ మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 39 వార్డుల్లో విజయం సాధించిన ఆ పార్టీ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఆ బీజేపీ మిత్రపక్షం శివసేన... మరాఠా నినాదం భుజానికెత్తుకున్నా ప్రజలేమీ పెద్దగా ఆదరించలేదు. 59 సీట్లలో విజయం సాధించిన ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. దేశ రాజకీయాల్లోనే తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 80 సీట్లు కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది.