: ఎల్టీసీ పేరిట డబ్బు నొక్కేయడం ఇక కుదరదు!
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) క్లయిములను, ప్రభుత్వ రీఎంబర్స్ మెంట్ ను విహార యాత్రలు చేయకుండానే విత్ డ్రా చేసుకోవడం కుదరదు. ఎల్టీసీ వాడుకునే వారు అన్ని టికెట్లు, ఆయా స్థలాల్లో తీసుకున్న ఫోటోలు, సెల్ఫ్ సర్టిఫికేషన్ అందిస్తేనే లీవులు, టికెట్లకు ఖర్చు పెట్టిన సొమ్మును రీఎంబర్స్ చేస్తారు. పండగలకు స్వస్థలాలకు వెళ్లినా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు మారిన నిబంధనలను పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం, ఎల్టీసీ క్లయిములను గరిష్ఠంగా నెల రోజుల్లో చెల్లిస్తారు. ఒకవేళ ఉద్యోగి లేదా ఉద్యోగిని హెడ్ క్వార్టర్స్ కు దూరంగా పనిచేస్తుంటే, మరో పది రోజుల అదనపు సమయం పట్టవచ్చు. "ఉద్యోగులు తాము తీయించుకున్న చిత్రాలను చూపించాల్సి వుంటుంది. తాము ప్రయాణించిన ప్రాంతాల్లో చూసిన ప్రదేశాల గురించి కూడా నియమిత రూపంలో పేర్కొనాల్సి వుంటుంది. ఎల్టీసీ తీసుకునే ముందే కంట్రోలింగ్ అధికారికి పూర్తి సమాచారం అందించాల్సి వుంటుంది" అని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం పేర్కొంది. కాగా, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణాలు సాగించకుండానే ఎల్టీసీ క్లయిములు చేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతుండటంతోనే కేంద్రం నిబంధనలను మార్చినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయాలు దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.