: కేసీఆర్ కంటే గ్లామరస్ ఎవరు?...సినీ తారల అవసరం టీఆర్ఎస్ కు లేదు!: కేటీఆర్
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపాలైన పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మరి విపక్ష నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని ఆయన సవాలు విసిరారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సినీ తారల గ్లామర్ టీఆర్ఎస్ కు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీకి గ్లామర్ అద్దేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అలాంటి వ్యక్తిని మించిన గ్లామర్ లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలన్న యావలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ ఉండగా, ముఖ్యమంత్రి పదవికి మరెవరూ అర్హులు కాదని భావిస్తున్నానని కేటీఆర్ చెప్పారు. తమ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని పూర్తి చేసేందుకు ఐదేళ్ల సమయం సరిపోదని, ఐదు నుంచి పదేళ్ల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాదులో పాతబస్తీ వెనకబాటుతనానికి కారణం ఎంఐఎం పార్టీ మాత్రమే కాదని ఆయన చెప్పారు. పాతబస్తీ వెనుకబాటుకు ఎంఐఎం పార్టీ కొంత కారణమని ఆయన తెలిపారు.